జర్నలిజం విలువలను కాపాడాల్సిన బాధ్యత జర్నలిస్టులదే. -మహబూబ్ నగర్ సమావేశంలో (టీయుడబ్ల్యుజే)రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.విరాహత్ అలీ.

జర్నలిజం విలువలను కాపాడాల్సిన బాధ్యత జర్నలిస్టులదే.
– టీయూడబ్ల్యూజే ముమ్మాటికీ.. జర్నలిస్టుల పక్షమే.
– మహబూబ్ నగర్ సమావేశంలో (టీయుడబ్ల్యుజే) రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.విరాహత్ అలీ.
మహబూబ్ నగర్ జిల్లా(తెలంగాణ ఫోకస్) ఏప్రిల్07: జర్నలిస్టుల ముసుగు ధరించి, కొన్ని అసాంఘిక శక్తులు చేస్తున్న అరాచకాలతో దిగజారిపోతున్న జర్నలిజం విలువలను పరిరక్షించు కోవాల్సిన బాధ్యతా జర్నలిస్టులపై ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజే)రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.విరాహత్ అలీ పిలుపునిచ్చారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య తమ కర్తవ్యాన్ని నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఆదివారం నాడు మహబూబ్ నగర్ పట్టణంలోని డిసిసిబి ఆడిటోరియంలో జరిగిన జిల్లా టీయుడబ్ల్యుజే సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు దండు దతేంద్ర అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి పేపర్ శ్రీనివాస్ తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ, గడిచిన పదేళ్ల కాలంలో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో టీయుడబ్ల్యుజే సభ్యులపై కొందరు అధికారాన్ని అడ్డుపెట్టుకొని కక్ష్యపూరితంగా వ్యవహరించి, అనేక ఇబ్బందులకు గురిచేస్తూ తమ వైపు లొంగదీసుకునే ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదన్నారు. టీయుడబ్ల్యుజే మొదటి నుండి తమ సభ్యులకు సైద్ధాంతిక పరమైన నైతిక విలువలు నేర్పిందని విరాహత్ స్పష్టం చేశారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా, కేవలం జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసమే తమ సంఘం పనిచేసిందన్నారు. ఈ సంఘం ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేసి 65 ఏళ్ల కాలంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వాలతో కొట్లాడి అనేక పథకాలను సాధించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పై సానుకూలంగా ఉందని, ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని వెల్లడించారని ఆయన అన్నారు. జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా, తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు తమ స్థాయిలో ముమ్మరంగా కృషి చేస్తామని విరాహత్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదని,ఎన్నికల తర్వాత ప్రధానమైన ఇళ్ల స్థలాలు,ఇండ్లు,హెల్త్ కార్డులు తదితర సౌకర్యాలపై మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం వచ్చేలా యూనియన్ ప్రయత్నం చేస్తుందన్నారు. సమావేశం అనంతరం జిల్లాలో వివిధ పత్రికలు, చానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులు 143 సంఘానికి రాజీనామా చేసి, విరాహత్ సమక్షంలో టీయూడబ్ల్యూజేలో చేరారు. అనంతరం ఇటీవల రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికై, మహబూబ్ నగర్ జిల్లాను పర్యటించిన విరాహత్ అలీని జిల్లా కమిటీ తరఫున ఘనంగా
సన్మానించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు జెమిని శేఖర్ గౌడ్, సీనియర్ జర్నలిస్టులు విజయరాజు, అహ్మద్ పాషా, విద్యా సాగర్ రెడ్డి, వెంకటేష్, మనిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.