Telugu Updates

పోస్టల్ బ్యాలెట్ కోసం సకాలంలో ఫారం-12(డి) సమర్పించాలి -కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

Post top

పోస్టల్ బ్యాలెట్ కోసం సకాలంలో ఫారం-12(డి) సమర్పించాలి. -కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

 నిజామాబాద్(తెలంగాణ ఫోకస్)ఏప్రిల్ 01: పోస్టల్ బ్యాలెట్ కోసం అవకాశం కలిగి ఉండి, దానిని వినియోగించదల్చిన వారు ఈ నెల (ఏప్రిల్) 20 వ తేదీ లోపు నిర్ణీత ఫారం-12(డి) పూరించి సంబంధిత శాఖల నోడల్ అధికారుల ద్వారా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేయాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో కలెక్టర్ సోమవారం అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే వివిధ శాఖల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అత్యవసర సర్వీసులకు చెందిన వారికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తోందని అన్నారు. ఎన్నికల కమిషన్ ద్వారా మీడియా పాసులు కలిగిన జర్నలిస్టులకు కూడా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ వెసులుబాటు కల్పించిందని అన్నారు. అయితే పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేందుకు వీలుపడని వారు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని వినియోగించుకునేలా చూడాలని నోడల్ అధికారులకు సూచించారు. ఏప్రిల్ 20వ తేదీ లోపు సమర్పించే ఫారం -12(డీ)లను మాత్రమే పరిగణలోకి తీసుకుని పోస్టల్ బ్యాలెట్ కు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఫారం -12 (డీ) దరఖాస్తులు నోడల్ అధికారి నుండి, లేదా ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల నుండి కూడా పొందవచ్చని, ఎలక్షన్ కమిషన్ పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత ఆర్.ఓ కార్యాలయానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్ కు చెందిన వారు నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆర్.ఓ ఆఫీసులో, నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ వారు నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో, బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని వారు బాన్సువాడ ఆర్డీఓ ఆఫీస్ లో, బోధన్ సెగ్మెంట్ కు చెందిన వారు బోధన్ ఆర్డీఓ కార్యాలయంలో, ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని వారు ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలంలోని ఆర్.ఓ ఆఫీసులో, బాల్కొండ సెగ్మెంట్ కు చెందిన వారు భీంగల్ మండల కేంద్రంలోని ఎం.పీ.డీ.ఓ కార్యాలయంలో తమ పోస్టల్ బ్యాలెట్ ను వినోయోగించుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా పోస్టల్ ఓటింగ్ సెంటర్ (పీవీసీ) అందుబాటులో ఉంటుందని తెలిపారు. అయితే ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్ణీత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మే 13 న నిర్వహించే పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం కల్పించబడదని, ఓటరు జాబితాలో వారి పేరును పోస్టల్ బ్యాలెట్ కింద మార్కింగ్ చేయబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నోడల్ అధికారి విజయేందర్ రెడ్డి, అత్యవసర సర్వీసుల పరిధిలోకి వచ్చే వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.