Telugu Updates

ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్. -ఆద్యంతం పర్యవేక్షించిన కలెక్టర్. -గెలుపొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేత. -కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సాఫీగా సాగిన ఓట్ల లెక్కింపు.

Post top

ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్.

– ఆద్యంతం పర్యవేక్షించిన కలెక్టర్.

– గెలుపొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేత.

– కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సాఫీగా సాగిన ఓట్ల లెక్కింపు

నిజామాబాద్(తెలంగాణ ఫోకస్) డిసెంబర్ 03: రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో చివరి అంకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా పరిధిలోని ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాలలో పోలైన ఓట్లను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం లెక్కింపు జరిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డితో కలిసి కౌంటింగ్ ప్రక్రియను ఆద్యంతం పర్యవేక్షణ జరిపారు. దీంతో ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా ఓట్ల లెక్కింపు సాఫీగా పూర్తయ్యింది. ఉదయం 5.00 గంటల నుండే కౌంటింగ్ కోసం సన్నాహాలు చేపట్టారు. ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో కలెక్టర్ నేతృత్వంలో కౌంటింగ్ సిబ్బంది మూడవ రాండమైజేషన్ నిర్వహించి, ఆ జాబితా ప్రకారంగా సిబ్బందిని ఆయా టేబుళ్ల వద్ద ఓట్ల లెక్కింపు బాధ్యతలు కేటాయించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన మీదట, ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తూ రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించారు. ముందస్తుగానే టేబుళ్ల వారీగా కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, సూక్ష్మ పరిశీలకులతో పాటు స్ట్రాంగ్ రూంల నుండి వెంటదివెంట ఈవీఎంలను కౌంటింగ్ హాళ్లకు తరలించేలా అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయడంతో ఏమాత్రం జాప్యం లేకుండా ఓట్ల లెక్కింపు జరుపుతూ త్వరత్వరగా ఫలితాలు వెల్లడించారు. మధ్యాహ్నం సమయానికే దాదాపుగా ఆరు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ అన్ని అంశాలను సరిచూసుకున్న మీదట రిటర్నింగ్ అధికారులు ఫలితాలను వెల్లడిస్తూ, గెలుపొందిన అభ్యర్థులకు పరిశీలకుల సమక్షంలో ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందిన పైడి రాకేష్ రెడ్డి(బీజేపీ)కి రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్, బోధన్ సెగ్మెంట్ నుండి గెలుపొందిన పి.సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్)కి రిటర్నింగ్ అధికారి రాజాగౌడ్, బాన్సువాడ నియోజకవర్గం నుండి విజయం సాధించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి(బీఆర్ఎస్)కు ఆ సెగ్మెంట్ రిటర్నింగ్ అధికారి భుజంగరావు, నిజామాబాద్ అర్బన్ నుండి గెలుపొందిన ధన్ పాల్ సూర్యనారాయణ (బీజేపీ)కు రిటర్నింగ్ అధికారి మకరందు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి గెలుపొందిన ఆర్.భూపతి రెడ్డి(కాంగ్రెస్)కు రిటర్నింగ్ అధికారి రాజేంద్రకుమార్, బాల్కొండ నియోజకవర్గం నుండి గెలిచిన వేముల ప్రశాంత్ రెడ్డి(బీ ఆర్ ఎస్)కు ఆ సెగ్మెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
కాగా, వెబ్ క్యామ్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి ఇతర ఉన్నతాధికారులు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండి, ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు నిశితంగా పర్యవేక్షణ జరిపారు. కౌంటింగ్ కేంద్రాలతో పాటు పరిసర ప్రాంతాలలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి, 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమలు చేశారు. కౌంటింగ్ కేంద్రాలలో ఇతరులను అనుమతించలేదు. కౌంటింగ్ సిబ్బందితో పాటు వివిధ బాధ్యతలు నిర్వర్తించిన సిబ్బందిని సైతం క్షుణ్ణంగా తనిఖీలు చేసి కౌంటింగ్ విధులకు పంపించారు. సెల్ ఫోన్ లు, వీడియోలు, కెమెరాలను నిషేధించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఏ.డీ.ఈ తోట రాజశేఖర్ నేతృత్వంలో ట్రాన్స్కో సిబ్బంది చర్యలు తీసుకున్నారు. పకడ్బందీ ఏర్పాట్ల నడుమ అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో పూర్తి పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపును పూర్తి చేసి జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను విజయవంతంగా ముగించడంలో జిల్లా యంత్రాంగం సఫలీకృతమైంది.
ఎలాంటి ఆటంకాలు లేకుండా జిల్లాలో ఎన్నికలను సాఫీగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అహరహం శ్రమించిన అధికారులు, సిబ్బందిని అభినందించారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.