కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో.. -పదేళ్లలో తెలంగాణను కెసిఆర్ నాశనం చేశాడు.. -బిజెపి అధికారంలోకి వస్తే బీసీ సీఎం.. -కెసిఆర్ అక్రమాలపై విచారణ చేయించి జైలుకు పంపుతాం.. -విజయ సంకల్పంతో బిజెపి అభ్యర్థులను గెలిపించండి.. -కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా..
కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో
– పదేళ్లలో తెలంగాణను
కెసిఆర్ నాశనం చేశాడు..
– బిజెపి అధికారంలోకి వస్తే బీసీ సీఎం..
– కెసిఆర్ అక్రమాలపై విచారణ చేయించి జైలుకు పంపుతాం..
– ఆర్మూర్ బస్ డిపో స్థలాన్ని బిఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కబ్జా చేశాడు..
– పసుపుబోర్డు ను ఏర్పాటు చేస్తాం..
– విజయ సంకల్పంతో బిజెపి అభ్యర్థులను గెలిపించండి..
– కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా..
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్) నవంబర్ 24: రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ సీఎం కేసీఆర్ చేతిలో లేదని, ఈ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు. బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ లో గల బైపాస్ రోడ్డు పక్కన శుక్రవారం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్రంలో అధికారంలో వస్తే తెలంగాణ అభివృద్ధికి కంకణ బద్ధులై ఉంటామన్నారు. పదేళ్లలో రాష్ట్ర ప్రజల కోసం కేసీఆర్ ఒక్క పని చేయలేదని అయితే కుమారుడు కేటీఆర్ కోసం లక్షల కోట్లు సంపాదించి పెట్టారన్నారు. ఆర్మూర్ టిఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి బస్ డిపో స్థలాన్ని కబ్జా చేసి పెద్ద షాపింగ్ మాల్ ను నిర్మించాడని తెలిపారు. స్థలాన్ని కబ్జా చేసి షాపింగ్ మాల్ నిర్మించిన జీవన్ రెడ్డికి కేసీఆర్ ఏ విధంగా పార్టీ టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టడం వల్లనే పార్టీ టికెట్ వచ్చిందన్నారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతుల ఆదాయం, ఎగుమతులను పెంచి పసుపు పై పరిశోధనలు చేయిస్తామన్నారు. నాణ్యమైన పసుపు సాగుకు ప్రోత్సహిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలోని బీడీ కార్మికుల కోసం 500 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని ప్రకటించారు. బిజెపి అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా గల్ఫ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎంఐఎం, రజాకార్ల కోసం సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినాన్ని జరిపించడం లేదని విమర్శించారు. త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేసిన అక్రమాలు అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తామన్నారు. రాష్ట్రాన్ని సాధిస్తే దళిత సీఎంను చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఇచ్చిన హామీను మార్చాలని, తాము అధికారంలోకి వస్తే బీసీ సీఎంను చేస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ పెట్రోల్ పై కస్టమ్ తగ్గించిన, రాష్ట్రంలో కెసిఆర్ జీఎస్టీని తగ్గించలేదని తాము అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. బిజెపి అధికారంలోకి వస్తే రైతులను ఆదుకోవడం కోసం క్వింటాలుకు రూ. 3,100 చెల్లించి కొనుగోలు చేస్తామన్నారు. అదేవిధంగా బైల్డ్ రైస్ ను సైతం కొనుగోలు చేస్తామన్నారు. ఉజ్వల యోజన కింద మహిళలకు 4 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. కెసిఆర్ డబ్బులు ఇచ్చిన వారికే మంత్రి పదవులు కట్టబెట్టాడని ఎద్దేవా చేశారు. కెసిఆర్ హయాంలో మియాపూర్ భూములు కబ్జా చేశారని, చేవెళ్లలో 1000కోట్ల భూములు ఆక్రమించారని, ఔటర్ రింగ్ రోడ్ లో స్కాం, కల్వకుంట్ల కవిత మద్యం దందా నిర్వహించి కోట్లు సంపాదించారని చెప్పారు. బిజెపి అధికారంలోకి వస్తే 2 లక్షల 50 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, పరీక్ష పత్రాలను లీకేజీ చేసినవారికి జైలుకు పంపుతామన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం ఆవశ్యకత ఉందా లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే అయోధ్య రాముడి దర్శనాన్ని ఉచితంగా చేయిస్తామన్నారు. ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజయ సంకల్పం తీసుకొని ఆర్మూర్, బాల్కొండ నుంచి పోటీ చేస్తున్న పైడి రాకేష్ రెడ్డి, ఏలేటి అన్నపూర్ణమ్మ లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ సభలో పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్, బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్య, నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, లోక భూపతిరెడ్డి, పెద్దొల్ల గంగారెడ్డి, కంచెట్టి గంగాధర్, జీవి నరసింహారెడ్డి, పాలెపు రాజు, ఆకుల రాజు, అల్జాపూర్ గంగాధర్, జెస్సు అనిల్, ద్యాగ ఉదయ్, రోహిత్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి సతీమణి రేవతి రెడ్డి, కుమార్తె సుచరిత రెడ్డి బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బిజెపి సభకు భారీగా జనం..
ఆర్మూర్ పట్టణం పెర్కిట్ లో నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభకు నియోజకవర్గం నుంచి భారీగా జనం తరలివచ్చారు. ఈ సభలో ఏర్పాటుచేసిన టెంట్లు నిండిపోవడంతో ఖాళీ స్థలంతో పాటు రోడ్డు వరకు మహిళలు, యువకులు, రైతులు వేలాదిగా నిలుచున్నారు. బిజెపి సభకు భారీగా జనం తరలివచ్చి విజయవంతం చేయడంతో బిజెపి శ్రేణులలో నూతన ఉత్సాహం వచ్చింది.