Telugu Updates

ఏకదాటి వర్షంలోనూ ఉత్సాహంగా సాగిన 5కె రన్.

Post top

ఆర్మూర్(TELANGANA FOCUS) నిజామాబాద్ ఆగస్టు19: ఓటింగ్ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో శనివారం ‘ఐ ఓట్ ఫర్ షూర్’ నినాదంతో ఉదయం నిర్వహించిన 5కె రన్ ఉత్సాహంగా సాగింది. శుక్రవారం రాత్రి నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతీ చోట పెద్ద సంఖ్యలో వివిధ వర్గాల వారు 5కె రన్ లో పాల్గొని ప్రజాస్వామ్య పరిణతి చాటారు. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ శాసనసభా నియోజకవర్గాల పరిధిలో 5కె రన్ జరిపారు. ప్రతీ చోట వర్షపు అడ్డంకిని అధిగమిస్తూ, వివిధ శాఖల అధికారులతో పాటు ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏ.ఎన్ ఎంలు, ఆరోగ్య సిబ్బంది, డ్వాక్రా సంఘాల సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున 5కె రన్ లో భాగస్వాములయ్యారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు 5కె రన్ విజయవంతానికి ముందస్తుగానే విస్తృత స్థాయిలో చేపట్టిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇచ్చాయి. నియోజకవర్గాల వారీగా ఎన్నికల విభాగం అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి 5కె రన్ నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. తదనుగుణంగా ఆయా నియోజకవర్గాల్లో అధికారులు అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ 5కె రన్ విజయవంతం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు. పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల కోసం ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.