Telugu Updates

వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మంత్రి వేముల,కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

Post top
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మంత్రి వేముల,కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
– భారీ వర్షాల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి మంత్రి, కలెక్టర్.
ఆర్మూర్(TELANGANA FOCUS) జూలై25: ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో వరద తాకిడికి గురైన ప్రాంతాలను మంగళవారం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సందర్శించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితి తీవ్రతను పరిశీలించారు. బాల్కొండ నియోజకవర్గంలోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్వస్థలమైన వేల్పూర్‌లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా కుండపోత వర్షం కురిసింది.
రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో కేవలం ఆరు గంటల వ్యవధిలోనే 46.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో వర్ష తాకిడికి లోనై కట్టలు తెగి గండ్లు పడిన మర్సుకుంట చెరువు, కాడి చెరువులను, తెగిపోయిన ప్రధాన రహదారులు, జలమయంగా మారిన వేల్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌, నివాస ప్రాంతాలను మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పచ్చలనడకూడ లోనూ తెగిన చెరువు, కొట్టుకుపోయిన బీ.టీ రోడ్డును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇసుక మేటలు వేసిన పంటలను పరిశీలించి, అధైర్యపడవద్దు… అన్ని విధాలుగా ఆదుకుంటామని రైతులకు భరోసా కల్పించారు. లోతట్టు ప్రాంత ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించి, భోజన వసతి కల్పించాలని, శిథిలావస్థకు చేరిన భవనాల్లో నివసిస్తున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం ఎనిమిది చోట్ల అత్యధిక వర్షం కురిసి రెడ్‌ జోన్‌ ప్రాంతాలుగా ప్రకటించగా, వాటిలో నిజామాబాద్‌ జిల్లాలోనే ఐదు ప్రాంతాలు పెర్కిట్‌, వేల్పూర్‌, భీంగల్‌, కోనసముందర్‌, జక్రాన్పల్లి ఉన్నాయని తెలిపారు.వీటిలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ సెగ్మెంట్‌ లోని మూడు ప్రాంతాలు వరద తాకిడికి లోనయ్యాయని, అత్యధికంగా రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఆరు గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో వేల్పూర్‌లో 46.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని అన్నారు.
కుండపోత వర్షం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, అక్కడక్కడ ఇసుకమేటలు వేసి పంటలు దెబ్బతినడం బాధ కలిగించిందన్నారు. తెగిన రోడ్లు, గండ్లు పడిన చెరువులను ప్రభుత్వపరంగా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. భారీ వర్షాల నేపధ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోందని, ప్రజలెవరూ భయాందోళనకు గురి కావద్దని, ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని సమాయత్తం చేశామన్నారు.
గ్రామాభివృద్ది కమిటీలు కూడా వర్ష పరిస్థితిని గమనిస్తూ, ఎక్కడైనా చెరువులు, కుంటలు తెగి, రోడ్లు కొట్టుకుపోతే తక్షణ చర్యలు చేపట్టాలని, అధికారులకు సమాచారం అందించాలని మంత్రి కోరారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం శాఖ హెచ్చరికలు చేసినందున రైతులు, ప్రజలెవరూ చెరువులు, కుంటలు, వాగుల వద్దకు వెళ్లవద్దని హితవు పలికారు.
కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గిన వెంటనే సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టేలా అధికారులను సన్నద్ధం చేశామన్నారు. ఇరిగేషన్‌, ట్రాన్స్కో, ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, పోలీస్‌ తదితర శాఖల అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉన్నారని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
శిథిలావస్థ భవనాల్లో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశామని కలెక్టర్‌ తెలిపారు. మంత్రి వెంట ఆర్మూర్‌ ఆర్డీఓ వినోద్‌ కుమార్‌, ఆర్‌ అండ్‌ బి ఎస్‌.ఈ రాజేశ్వర్‌, ట్రాన్స్కో ఎస్‌.ఈ రవీందర్‌, డీపీఓ జయసుధ, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
Post bottom

Leave A Reply

Your email address will not be published.