Telugu Updates

బీర్లు పొంగించేస్తున్నారుగా….

Post top

హైదరాబాద్, ఏప్రిల్ 20:అసలే మండే ఎండలు. ఈ ఎండ వేడికి మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. అత్యవసరమైతే తప్ప చాలామంది ప్రజలు మధ్యాహ్నం బయటకు రావడంలేదు. దీంతో రోడ్లపై రద్దీ తగ్గింది. ఎండలకు తోడు వడగాలుల తీవ్రత పెరగడంతో జనం బయటకు రావడం చాలా వరకు తగ్గింది. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రతతో బీర్ల విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మందు బాబులు శరీరంలోని వేడిని తగ్గించుకునేందుకు చిల్ బీర్లు తాగుతున్నారు. దీంతో తెలంగాణలో ఈ నెలలో బీర్ల విక్రయాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. హైదరాబాద్‌లో ఏప్రిల్ 1 నుంచి 19 వరకు దాదాపు 1.21 కోట్ల బీర్లు అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో మొత్తం 8,46,175 బీర్లు అమ్ముడయ్యాయి. ఒక కేసులో 12 బీర్లు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే బీర్లు భారీ మొత్తంలో అమ్ముడుపోయాయి.ఈ నెలలో ఇప్పటివరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి రోజుకు సగటున 6 లక్షల బీర్లు అమ్ముడయ్యాయి. ఎండలతో మార్చి నుంచి బీర్ల విక్రయాలు భారీగా పెరిగాయి. ఏప్రిల్‌లో ఈ నెల 17వ తేదీ వరకు హైదరాబాద్‌లో 1,94,351 కేసుల బీర్లు, రంగారెడ్డి జిల్లాలో 5,59,5746, మేడ్చల్ జిల్లాలో 92,078 కేస్‌ల బీర్లు అమ్ముడయ్యాయి. మార్చిలో హైదరాబాద్ జిల్లాలో 3,68,569 కేస్‌లు, రంగారెడ్డి జిల్లాలో 10,77,240 కేస్‌లు, మేడ్చల్ జిల్లాలో 1,63,358 కేస్‌ల బీరు విక్రయాలు జరిగాయి.అలాగే ఫిబ్రవరి నాటికి హైదరాబాద్‌లో 3,31,784, రంగారెడ్డిలో 9,34,452, మేడ్చల్‌లో 1,46,763 కేస్‌ల బీర్లు అమ్ముడయ్యాయి.

జనవరిలో హైదరాబాద్ జిల్లాలో 2,96,619 కేస్‌లు, రంగారెడ్డి జిల్లాలో 8,36,907 కేస్‌లు, మేడ్చల్ జిల్లాలో 1,34,468 కేస్‌లు అమ్ముడుపోయాయి. మద్యం విక్రయాలు పెరగడంతో ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వస్తోంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. తీవ్ర వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉంది. దీంతో బీర్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా మద్యం దుకాణాలకు నిత్యం బీరు సరఫరా అవుతోంది. ఈ నెల, వచ్చే నెలలో బీర్ల విక్రయాలు రికార్డు సృష్టించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.