Telugu Updates

ఇక సినిమాలు క్లాసిఫికేషన్

Post top

హైదరాబాద్, ఏప్రిల్ 20:ఏ సినిమాలను ఏయే వయసుల వారు చూడచ్చో వర్గీకరించేందుకు ఉద్దేశించిన సినిమాటోగ్రఫ్‌ సవరణ బిల్లు-2023ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీనిని పార్లమెంటులో కూడా ప్రవేశపెట్టనున్నారు.అయితే ఇప్పటివరకు సినిమాలను యూ, ఏ, యూఏ అనే మూడు విభాగాలుగా వర్గీకరించి సెన్సార్‌బోర్డు అనుమతి మంజూరు చేస్తోంది. ఇది కాకుండా వైద్యులు, శాస్త్రవేత్తలు వంటి ప్రత్యేక విభాగ వీక్షకులకు ఉద్దేశించిన చిత్రాలకు ఎస్‌ వర్గం కింద అనుమతి ఇస్తోంది. యూఏ చిత్రాలను 12 ఏళ్లలోపు పిల్లలు చూడాలంటే అది వారి తల్లిదండ్రుల పర్యవేక్షణకు లోబడి జరగాలనేది ఓ నిబంధన.ఇక నుంచి 12 ఏళ్ల లోపు వారికి బదులు యూఏ 7+, యూఏ 13+, యూఏ 16+ అనే వర్గీకరణను త్వరలోనే తీసుకురానున్నారు.

ఆయా వయసుల వారు వాటిని చూడవచ్చని వీటి అర్థం. సినిమాల ధ్రువీకరణ ప్రక్రియను మెరుగుపరచడంతో పాటు వేర్వేరు వేదికల్లోనూ చిత్రాల వర్గీకరణలో ఏకరూపతను తీసుకువచ్చేలా సవరణలు ప్రతిపాదిస్తున్నారు. అలాగే పైరసీ చేసిన చిత్రాలను ఇంటర్నెట్‌ ద్వారా ప్రసారాన్ని అడ్డుకునేందుకు వీలు కల్పించేలా చట్టంలో మార్పులు చేయనున్నారు. సుప్రీంకోర్టు తీర్పులు, కార్యనిర్వాహక ఉత్తర్వులను క్రోడీకరిస్తూ కొన్ని సవరణలు చట్టంలో చేర్చనున్నారు. అలాగే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరిచేలా ఈ బిల్లు ఉంటుందని అనురాగ్ ఠాకుర్‌ చెప్పారు. పైరసీని అడ్డుకోవడం, ఏయే వయసు వారు ఏయే చిత్రాలు చూడవచ్చో వర్గీకరించడం, కాలంచెల్లిన నిబంధనల్ని రద్దు చేయడంపై.. వివిధ వర్గాల నుంచి వచ్చిన డిమాండ్లకు బిల్లులో చోటు కల్పించినట్లు తెలిపారు. అలాగే త్వరలోనే మరికొన్ని వివరాలను ముసాయిదాలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.