Telugu Updates

దుష్టశక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం

Post top

తలసరి ఆదాయంలో 4 పెద్ద రాష్ర్టాలను దాటాం
దేశంలో కరెంట్‌ ఉంటే వార్త.. ఇక్కడ పోతే వార్త
అల్వాల్‌ టిమ్స్‌లోనే ప్రసూతి విభాగం ఏర్పాటు
ఇక విద్య, వైద్యంపై దృష్టి: ముఖ్యమంత్రి కేసీఆర్‌
హైదరాబాద్‌లో మూడు టిమ్స్‌లకు భూమిపూజ
మొత్తం 6000 ఆక్సిజన్‌, 1500 ఐసీయూ బెడ్స్‌

ఒక్కో టిమ్స్‌లో 30 విభాగాల్లో 200 మంది టీచింగ్‌ డాక్టర్లు, 500 మంది రెసిడెంట్‌ డాక్టర్లు కలిపి మొత్తం 700 మంది సేవలందిస్తారు.

 

ప్రతి దవాఖానలో వెయ్యి పడకలుంటాయి. 300 పడకలను ఐసీయూకు కేటాయించారు. ప్రతి పడకకు ఆక్సిజన్‌ సరఫరా ఉంటుంది.

 

అల్వాల్‌ టిమ్స్‌ న్యూరో సైన్స్‌

ఎల్బీనగర్‌ టిమ్స్‌ గ్యాస్ట్రో సైన్స్‌

సనత్‌నగర్‌ టిమ్స్‌ కార్డియాక్‌ సైన్స్‌

ప్రతి టిమ్స్‌లో 16 ఆపరేషన్‌ థియేటర్లు
16 స్పెషాలిటీ, 15 సూపర్‌ స్పెషాలిటీ సర్వీసుల్లో పీజీ సీట్లు రానున్నాయి.
నర్సింగ్‌, పారామెడికల్‌ విద్య అభ్యసించేలా ఏర్పాట్లు ఉంటాయి.
రాష్ట్రమంతా రాజకీయ సభలు నడుపుతున్నరు.. మనం ప్రజల ఆరోగ్యమూ, వైద్యం మీద సభ నడుపుతున్నాం. దీన్నిబట్టి.. ఎవరు దేని కోసం పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. –సీఎం కేసీఆర్‌
అన్ని కులాలు, మతాల ప్రజలను సమానంగా ఆదరించే భారతదేశంలో కొందరు మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. దేశంలోని సామరస్య వాతావరణం చెడిపోతే ఎటూ కాకుండా పోతామని, ఆ క్యాన్సర్‌ జబ్బు మనకు రాకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో మంగళవారం మూడు తెలంగాణ వైద్య విజ్ఞాన శాస్ర్తాల సంస్థ (టిమ్స్‌) దవాఖానలకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం అల్వాల్‌లో నిర్వహించిన బహిరంగసభలో సీఎం మాట్లాడారు.

‘తెలంగాణలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొందరు మతం పేరు మీద.. కులం పేరు మీద.. చిల్లరమల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఆ జబ్బు మనకు పట్టుకుంటే చాలా ప్రమాదంలో పడిపోతాం. ఫలానా వాళ్ల షాప్‌లో పూలు కొనొద్దు.. ఫలానా వాళ్ల షాప్‌లో అది కొనొద్దు.. ఇది కొనొద్దు.. అని మాట్లాడుతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే ఏం జరగుతుందో.. విజ్ఞత ఉన్న మీరే ఆలోచించాలి. ఎందుకంటే మన భారతీయులు 13 కోట్ల మంది విదేశాల్లో పనిచేస్తున్నారు. ఈ దరిద్రపు చర్యలతో ఒకవేళ వాళ్లందరినీ ఆ ప్రభుత్వాలు తిరిగి పంపిస్తే వాళ్లకు ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి.. ఎవరు సాదాలి’ అని సీఎం ప్రశ్నించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. హైదరాబాద్‌లో ఈ ఏడేండ్లలో దాదాపు రూ.2.30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల మందికి ఉద్యోగాలు దొరికాయి. రేపు హైదరాబాద్‌ నగరంలో 14 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఫార్మా యూనివర్సిటీతోపాటు ఫార్మాసిటీ కూడా వస్తున్నది. మేడ్చల్‌ ఏరియా ప్రపంచానికే వ్యాక్సిన్‌ సెంటర్‌గా ఉన్నది. ఎక్కడెక్కడి వాళ్లో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు.. ఎవరో ఏదో మాట్లాడితే తాత్కాలికంగా గమ్మత్తుగా అనిపిస్తది.. అప్పటికప్పుడు మజా అనిపిస్తది.. కానీ శాశ్వతంగా మన ప్రయోజనాలు దెబ్బతింటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అలాంటి సంకుచిత ధోరణులకు తెలంగాణలో ఆస్కారం ఇవ్వొద్దు.

దేశంలో కరెంట్‌ ఉంటే వార్త.. తెలంగాణలో కరెంట్‌ పోతే వార్త
ఏడేండ్ల కింద ఎలాంటి కరెంట్‌ గోసలు ఉండెనో మనందరికీ తెలుసు. ఇవాళ మన దగ్గర కరెంట్‌ పోతే వార్త.. ఇండియాలో కరెంట్‌ ఉంటే వార్త. ఇది వాస్తవం. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా రైతులు రోడ్ల మీదికి వచ్చి పోరాటాలు చేస్తున్నారు. కానీ పసికూన తెలంగాణలో రాత్రింబవళ్లు మనం కష్టంచేసి, తిప్పలపడి 24 గంటల కరెంట్‌ అన్ని రంగాలకు ఇచ్చుకుంటున్నాం. ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే ఎమ్మెల్యేల సావుకు వచ్చేది.. ఏమూలకు పోయినా బిందెల ప్రదర్శనలు.. ధర్నాలు.. రాస్తారోకోలు జరిగేది. ఇవాళ తెలంగాణలో బిందెల ప్రదర్శన బంద్‌ అయ్యింది. మిషన్‌ భగీరథ పుణ్యమా అని బ్రహ్మాండంగా తాగునీటి కొరత తీర్చుకున్నాం. ధాన్యం పండించడంలో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థాయికి ఎదుగుతున్నాం.

పటిష్ఠమైన వైద్య వ్యవస్థే లక్ష్యం..
కరోనా మహమ్మారి కారణంగా చాలామంది చనిపోయారు. అంతకుముందు నాకు కూడా దీనిపై అంత నాలెజ్డ్‌ లేదు. కొందరు శాస్త్రవేత్తలను అడిగితే.. కరోనానే కాదు దాని తాతలు కూడా ముందుముందు వస్తాయి అని చెప్పారు. ఎవరికైతే చాలా పటిష్ఠమైన వైద్య వ్యవస్థ ఉంటుందో వాళ్లు చాలా తక్కువ నష్టంతో బయటపడతారు. ఎవరికైతే వ్యవస్థ బాగా ఉండదో వాళ్లు చాలా నష్టపోతారు, లక్షల మంది చనిపోతారు అని చెప్పారు. వైరస్‌లను మొత్తానికి ఫినిష్‌చేసే మెకానిజం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. కానీ వాటిని కట్టడి చేసే విధానం మాత్రం ఉన్నది. అందుకే వైద్య విధానాన్ని పటిష్ఠం చేసే క్రమంలో పేదల కోసం, ఆర్థికంగా ఇబ్బందులు పడేవారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. కొన్ని సందర్బాల్లో నాకే ఆశ్చర్యం కలుగుతుంది.. మనమే ఇదంతా చేసినమా అని. ఎవరూ ఊహించని కార్యక్రమాలు చేసినం.

నీలోఫర్‌ ఘటన కదిలించింది
ఒకరోజు నీలోఫర్‌ దవాఖానలో ఒకరు చనిపోయారు. వాళ్ల దగ్గర డబ్బులు లేవు పాపం పేదవాళ్లు. ఎక్కడో నిజామాబాద్‌ జిల్లా నుంచి వచ్చారు. ఆ సమాచారం తెలిసి సంబంధిత మంత్రికి చెప్పి ప్రైవేటు అంబులెన్స్‌లో భౌతికకాయాన్ని ఇంటికి పంపించాం. వైద్యం కోసం వచ్చే పేదల్లో కొందరు బతుకుతరు. కొందరు చనిపోతరు. అది భగవంతుడి దయ. ఆ ఘటన తరువాత మానవీయకోణంలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ఒక 50 నుంచి 60 అంబులెన్స్‌లు ఏర్పాటుచేసి జిల్లాల నుంచి వైద్యం కోసం హైదరాబాద్‌కు వచ్చి దురదుష్టవశాత్తు చనిపోయే వాళ్లను ఇంటిదగ్గర వదిలిపెట్టి రావాలి అని సీఎస్‌, హెల్త్‌ సెక్రటరీలకు చెప్పాం. ఈ సదుపాయం ఇండియాలోనే కాదు ప్రపంచంలో అమెరికా, బ్రిటన్‌ లాంటి దేశాల్లోనూ ఎక్కడా లేదు.

ఉత్తమ సేవలు అందించే గొప్ప టిమ్స్‌గా ఇది చరిత్రలో నిలిచిపోద్ది..
నేను సిద్దిపేటలో హైస్కూల్‌ చదువుకునే కాలం నుంచి బస్సులో వస్తా, పోతా ఉంటే.. ఈ కాంపౌండ్‌ వాల్‌ చూసేవాడిని.. దీని పక్కనున్న రాజీవ్‌ రహదారి ఎత్తు లేచి, లేచి కాంపౌండ్‌వాల్‌ను దాటేవరకు పోయింది. కానీ ఈ జాగా ఇలాగే ఉండిపోయింది. ఈ స్థలం భారతీయ విద్యాభవన్‌ అని ఒక చిన్న సంస్థకు ఇచ్చారు. కానీ ఇది చాలారోజులుగా నిరుపయోగంగా ఉంది. వారితో సంప్రదింపులు చేశాం. మాకు జాగా వేరే చోట ఇవ్వమని అడిగారు. వేరే దగ్గర వారికి అవసరమైన స్థలం ఇచ్చి సుమారు 30 ఎకరాలు ఉన్న ఈ స్థలాన్ని మనం తీసుకున్నాం. ఇక్కడ వచ్చే దవాఖాన మామూలుది కాదు. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఎలాగైతే ఉందో అలాంటి దావాఖాన ఇక్కడ వస్తుంది. దాదాపు 16 స్పెషాలిటీ, 15 సూపర్‌ స్పెషాలిటీ విభాగాలలో బ్రహ్మాండంగా వైద్యం అందే అవకాశం ఉంటుంది. కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండెవ్యాధి ఏదైనా కావచ్చు అన్నింటికీ ఇక్కడ వైద్య సౌకర్యం ఉంటుంది. వంద శాతం ప్రభుత్వ ఖర్చుతో పేదలకు కార్పొరేట్‌ స్థాయి ఉచిత వైద్యసేవలు అందుతాయి. ఈ చుట్టు పక్కల బాగా జనాభా పెరుగుతుందని స్థానిక ఎమ్మెల్యేలు సాయన్న, హన్మంతరావు ఇప్పుడే నాకు చెప్పారు. మేడ్చల్‌ కూడా నానాటికీ పెరిగిపోతున్నది. కాబట్టి దీని మీద లోడ్‌ బాగా పడుతుంది. అందుకే మంత్రి హరీశ్‌రావును నేను కోరుతున్నా.. ఇక్కడ స్థలం ఎక్కువగా ఉంది కాబట్టి ఇందులోనే ప్రత్యేకంగా ఒక ప్రసూతి వింగ్‌ ఏర్పాటు చేయాలి. దాని కోసం మళ్లీ ఎక్కడికో పోవాల్సిన పని ఉండొద్దు. వంద పడకలో.. 200 పడకలో ఇక్కడే నిర్వహిస్తే వేరే చోటు కు పోయే అవసరం రాదు. ఉత్తమమైన సేవలు అందిం చే ఒక గొప్ప టిమ్స్‌ దవాఖానగా ఇది నిలిచిపోవాలి.

హైదరాబాద్‌కు నలుదిక్కులా దవాఖానలు

కరోనా లాంటి వైరస్‌లు భవిష్యత్తులోనూ వచ్చే ప్రమాదం ఉంది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఇవాళ ఒక కోటి అరవై నాలుగు లక్షల జనాభా ఉంది. హైదరాబాద్‌ నగరం మీద రోజురోజుకు లోడ్‌ ఎక్కువైతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా పాత దవాఖానాలు గాంధీ, నీలోఫర్‌ అంటే కుదరదు. అందుకే హైదరాబాద్‌కు నలుదిక్కులా నాలుగు దవాఖానలతోపాటు నిజాం ఆర్థోపెడిక్‌లో కూడా బెడ్స్‌ను పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్‌కు దక్షిణభాగం గచ్చిబౌలిలో ఒక టిమ్స్‌ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా చెస్ట్‌ హాస్పిటల్‌ పశ్చిమభాగంలో ఒక టిమ్స్‌. తూర్పుభాగం ఎల్బీనగర్‌ గడ్టిఅన్నారంలో ఒక దవాఖానకు ఈ రోజే శంకుస్థాపన చేశాం. ఉత్తర భాగంలో కంటోన్మెంట్‌లో దవాఖాన ఏర్పాటు చేసుకుంటున్నాం. హైదరాబాద్‌ నలుదిక్కులా ఎక్కడి జనాభాకు అక్కడే వైద్య సేవలు అందించేందుకు ఈ నాలుగు దవాఖానలను మనం తెచ్చుకున్నాం. వేయి పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్స్‌ ప్రారంభమవుతాయి. ప్రసూతి కేంద్రాలు కూడా ఏర్పడుతాయి. చిన్నపిల్లల జబ్బులు కూడా ఇక్కడే నయం చేస్తారు. అలాగే నిజాం ఆర్థోపెడిక్‌ దవాఖానలో మరో 2000 పడకల అదనపు బ్లాక్‌ ఏర్పాటు చేసుకుంటున్నాం. దీంతో మొత్తం హైదరాబాద్‌ నగరంలో 6000 బెడ్స్‌ ఆక్సిజన్‌తో ఉండేలా.. ఇందులో దాదాపు 1500 ఐసీయూ బెడ్స్‌ ఉండేలా దవాఖానల నిర్మాణం జరుగుతుంది.

 

మంత్రులకు ప్రశంసలు

ఈ ప్రాంతంలో ఇంతమంచి దవాఖానను తెచ్చుకున్న స్థానిక నాయకులు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సాయన్న, హన్మంతరావులను అభినందిస్తున్నా. ఈ దవాఖాన మంచి సేవలు అందించాలని, వాటిని మీరు బాగా ఉపయోగించుకోవాలని, దోపిడీకి గురికాకుండా ఉచిత వైద్యం సామాన్య ప్రజలకు అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఇక్కడి శాసనసభ్యులు, మంత్రి, కంటోన్మెంట్‌, మల్కాజ్‌గిరి, మేడ్చల్‌ నియోజకవర్గాల ప్రజలను హృదయపూర్వకంగా మరోసారి అభినందిస్తున్నా..

 

మనకంటే 4 లక్షల ఏండ్ల క్రితమే వైరస్‌ పుట్టింది..

మానవులు ఈ భూగోళం మీదకు 4 లక్షల ఏండ్ల క్రితం వచ్చారు. కానీ వైరస్‌లు మనుషులు రావడానికి 4 లక్షల ఏండ్ల క్రితమే వచ్చాయని ఎంటమాలజిస్టులు చెప్పారు. అంటే 8 లక్షల సంవత్సరాల ముందే వైరస్‌లు వచ్చాయి. వాటిని రూపుమాపడం సాధ్యం కాదు, అవి ప్రకృతిలో భాగంగా ఉంటాయి. అవి ఎప్పుడెప్పుడు ప్రకోపం చెందుతాయో అప్పుడు వ్యాప్తి చెందుతాయి అని చెప్తే నేను బేజారైపోయిన. కరోనా అయిపోదా అంటే కరోనా తాతలు కూడా వస్తాయి భవిష్యత్తులో అని సైంటిస్టులు చెప్పారు.

మూడు టిమ్స్‌కు సీఎం భూమిపూజ

2679 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం
నగరం నలువైపులా పేదలకు అత్యాధునిక వైద్యసేవలు

పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించే మంగళప్రదమైన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ నగరానికి నలువైపులా నిర్మించతలపెట్టిన సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలకు ఒకేరోజు శంకుస్థాపన చేశారు. గడ్డిఅన్నారంలో ఉదయం 11.30 గంటలకు, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన ప్రాంగణంలో మధ్యాహ్నం 12.20 గంటలకు, అల్వాల్‌లో మధ్యాహ్నం 12.55 గంటలకు సీఎం భూమిపూజ చేశారు. మూడువేల పడకల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ సూపర్‌స్పెషాలిటీ దవాఖానలను గడ్డి అన్నారంలో రూ.900 కోట్లు, ఎర్రగడ్డలో రూ.882 కోట్లు, అల్వాల్‌లో రూ.897 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌, మాగంటి గోపీనాథ్‌, మైనంపల్లి హనుమంతరావు, జీ సాయన్న, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, వాణీదేవి, దయానంద్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కార్పొరేషన్‌ చైర్మన్లు, స్థానిక కార్పొరేటర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Post bottom

Leave A Reply

Your email address will not be published.