- కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’
- వరుణ్ జోడీగా సయీ మంజ్రేకర్
- సంగీత దర్శకుడిగా తమన్
- కొత్తదనం లేని కథ
- బలహీనమైన స్క్రీన్ ప్లే
కాలక్రమంలో 15 ఏళ్లు గడిచిపోతాయి. ‘గని’ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటాడు. అతని దృష్టి అంతా కూడా బాక్సింగ్ పైనే ఉంటుంది. తల్లికి తెలియకుండా బాక్సింగ్ లో అంచలంచెలుగా ఎదుగుతూ వెళుతుంటాడు. ఈ సమయంలోనే అదే కాలేజ్ లో చదువుతున్న మాయ (సయీ మంజ్రేకర్) ప్రేమలో పడతాడు. బాక్సర్ గా ఒక దశకి చేరుకున్న ‘గని’కి, గతంలో అతని తండ్రి ఎదుగుదలను అడ్డుకున్న ఈశ్వర్ నాథ్ (జగపతిబాబు) తారసపడతాడు. అలాగే ‘గని’ తండ్రి నిజాయతీని గురించి తెలిసిన విజయేంద్ర ( సునీల్ శెట్టి) ‘గని’ కి సాయపడటానికి రంగంలోకి దిగుతాడు. ఇక అప్పటి నుంచి కథ కొంత ఆసక్తికరంగా మారుతుంది.
కథ విషయానికి వస్తే .. ఎక్కడా కొత్తదనమనేది కనిపించదు. కథపై పెద్దగా కసరత్తు జరిగినట్టు అనిపించదు. తెరపై ఒక సీన్ తరువాత ఒక సీన్ వస్తూ పోతూ ఉంటాయి. ఎక్కడా కూడా ఎలాంటి ట్విస్టులు కనిపించవు. ఇంట్రవెల్ కి ముందు ఒక బ్యాంగ్ కావాలి గనుక, అప్పటి వరకూ పేరుగా మాత్రమే వినిపిస్తూ వచ్చిన విక్రమాదిత్య ఎవరనేది రివీల్ చేస్తారంతే. ఇక ఆ తరువాతైనా కథ స్పీడ్ అందుకుంటుందేమో .. ట్విస్టులు ఉంటాయేమోనని అనుకున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతుంది.
నదియాను .. ఆమె కొడుకును ఊళ్లో వాళ్లంతా కూడబలుక్కున్నట్టుగా చూపుడు వ్రేలు చూపిస్తూ నిందించడం చూస్తే, 80లలో వచ్చిన సినిమాలు గుర్తుకు వస్తాయి. రాజారవీంద్ర వచ్చి మనం కోటీశ్వరులం .. మనకి ఈ బాక్సింగ్ అవసరమా? అని నవీన్ చంద్రను అడిగే సీన్ మరీ నాటకీయంగా అనిపిస్తుంది. వంచనతో ఎదుగుతూ వచ్చిన ఈశ్వరనాథ్, హీరోను పలకరించేందుకు హాస్పిటల్ కు వచ్చి గతంలో తాను చేసిన ఘన కార్యాల లిస్ట్ చెప్పేస్తాడు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నా .. ఎవరైనా రికార్డు చేసినా తాను చిక్కుల్లో పడతాననే ఆలోచన ఆయనకి రాకపోవడం ఆశ్చర్యం.
కథ ఆరంభంలోనే హీరోను చూసి హీరోయిన్ లవ్ లో పడుతుంది. ఎందుకు పడిందనేది ఎవరికీ అర్థం కాదు. హీరో కనుక పడాలంతే అన్నట్టుగానే పడిపోతుంది. పైగా ఆమె ఎంట్రీ సీన్ కూడా రోటీన్ గా అనిపిస్తుంది. ఇక నరేశ్ అండ్ టీమ్ తో కామెడీ నడిపించడానికి ప్రయత్నించిన దర్శకుడు ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే మానుకున్నాడు. ఇంట్రవెల్ దగ్గరికి వచ్చేసరికి ఇక చాలు అనుకున్నాడేమో లవ్ ట్రాక్ ను పక్కన పెట్టేశాడు. దాంతో పాటల కోసం ఎదురు చూసిన ప్రేక్షకులకు బాక్సింగ్ పంచ్ లు ఊపిరాడకుండా చేస్తాయి.
బాక్సర్ గా తన తండ్రి తెచ్చిన అవమానాల కారణంగా ఆయన పట్ల కోపంతోనే హీరో పెరుగుతాడు. కానీ బాక్సింగ్ అంటే ఇష్టాన్ని పెంచుకుంటాడు. జీవితంలో బాక్సింగ్ జోలికి వెళ్లనని తల్లికి మాట ఇస్తాడు .. కానీ దానికి కట్టుబడకుండా ఆడుతూ వస్తాడు. ఈ విషయంలోనే సామాన్య ప్రేక్షకుడికి క్లారిటీ లోపిస్తుంది. ‘మీ నాన్న చేసింది తప్పు అని నేను నీకు ఎప్పుడైనా చెప్పానా?’ అని పాతికేళ్ల హీరోను పట్టుకుని తల్లి అడుగుతుంది. ఒక వైపున అతను తండ్రి పట్ల ద్వేషంతో పెరుగుతూ ఉంటే, మీ నాన్న అలాంటివారు కాదని చెప్పడానికి అడ్డేమి ఉంటుంది?
ఇలా మనసును కదిలించే సన్నివేశాలుగానీ .. కరిగించే సన్నివేశాలుగాని లేకుండా కథ నడుస్తూ ఉంటుంది. జగపతిబాబు – వరుణ్ తేజ్ మధ్యలో వచ్చే సీన్స్ మాత్రం కాస్త బెటర్ గా అనిపిస్తాయి. దర్శకుడు కొత్తదనం కొన్ని సీన్స్ లో తెలుస్తూనే ఉంటుంది. పాటల్లో ‘ రోమియో జూలియట్’ కాస్త ఊపుమీద సాగుతుందంతే. అలాగే ‘గని’ టైటిల్ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయిందనే చెప్పాలి. జార్జ్ సి. విలియమ్స్ ఫొటోగ్రఫీ బాగుంది .. అలాగే ఎడిటింగ్ కూడా. అబ్బూరి రవి డైలాగ్స్ బాగున్నాయి. ‘అబద్ధానికి ఆయువు పోస్తూ పోతున్నాను’ .. ‘ఆడితే రికార్డులలో ఉంటాం .. గెలిస్తే చరిత్రలో ఉంటాం’ .. ‘ చేసిన కర్మ పిన్ కోడ్ వెతుక్కుని మరీ వస్తుంది’ వంటి డైలాగ్స్ బాగున్నాయి.
వరుణ్ తేజ్ .. సయీ మంజ్రేకర్ .. జగపతిబాబు .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నదియా .. నవీన్ చంద్ర పాత్రలే ఈ కథలో ప్రధానంగా కనిపిస్తాయి. మిగతా పాత్రల పరిథి నామ మాత్రమే. మేకప్ తేడా కొట్టిందేమో తెలియదు గానీ నదియా చాలా డల్ గా కనిపించింది. కథలో బలం .. కథనంలో ఆసక్తి అంతగా లేకపోవడంతో, ఆర్టిస్టులు తమవంతు లాక్కొచ్చారు. ఇక తమన్నాతో ‘కోడ్తే .. ‘ అనే స్పెషల్ సాంగ్ చేశారు .. కాకపోతే సందర్భానికి అతకలేదు. పిలవని పేరంటానికి వచ్చినట్టుగా హఠాత్తుగా వచ్చేసి వెళ్లిపోతుంది.
కథ నేపథ్యమే బాక్సింగ్ గనుక, ఆ ఎపిసోడ్స్ బాగానే వచ్చాయి. కథలో బాక్సింగ్ ఒక భాగమైతే ప్రేక్షకులకు బోర్ గా అనిపించదు. కానీ కథ మొత్తం బాక్సింగ్ రింగ్ చుట్టూ తిరిగితే మాత్రం ప్రేక్షకులలో సహనం నశిస్తుంది. పాటల పరంగా .. ఎంటర్టైన్మెంట్ పరంగా .. స్క్రీన్ ప్లే పరంగా ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేదేమోనని అనిపిస్తుంది. వరుణ్ తేజ్ నిజంగా బాక్సర్ లా అనిపించాడు. కథను .. టైటిల్ ను తన భుజాలపై వేసుకుని మోశాడు. కానీ కథలో కొత్తదనం లేకపోవడం .. ఉన్న కథలో పట్టు లేకపోవడం ఒకింత నిరాశకు గురిచేస్తుందంతే!