న్యూఢిల్లీ : ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో ఏర్పాట్లను ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపరిశీలించారు.
ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వరి ధాన్యం సేకరించేంత వరకు కేంద్రంపై పోరాటం కొనసాగుతోందని తేల్చిచెప్పారు. తెలంగాణ రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు 300 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే తెలంగాణ రైతుల పట్ల కక్షపూరితంగా ప్రవర్తిస్తుందన్నారు. పంజాబ్, హర్యానాలో ధాన్యం సేకరించిన మాదిరిగానే తెలంగాణ నుంచి కూడా ఎఫ్‌సీఐ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ధర్నా చేస్తున్నామని తెలిపారు. కేంద్రం ధాన్యం సేకరించాలనే డిమాండ్‌తో ఇప్పటికే ప్రతి గ్రామం, మండలం, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం సేకరించకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ తడాఖా, దమ్ము చూపిస్తామని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
ధర్నాకు 1500 మంది వరకు హాజరు
11న ఢిల్లీలో చేపట్టబోయే ధర్నాకు 1500 మంది వరకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలోనే ఈ ధర్నా చేపడుతున్నామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ ధర్నాలో పాల్గొంటారని పలా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.