Telugu Updates

సకల శుభారంభం

Post top

చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది పర్వదినం. ఆబాలగోపాలం ఆనందంగా చేసుకునే పండుగ ఉగాది. కాలగమన సౌ«ధానికి తొలి వాకిలి. పౌర్ణమిరోజున చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ మాసానికి అదే పేరు ఉంటుంది. చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉండటం వలన ఈ మాసావికి చైత్రమాసం అని పేరు. అన్ని ఋతువులకన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు.

కోకిల పాటలు, సన్నజాజి, మల్లెల పరిమళాలు, చిగురించిన ఆకులతో పచ్చని చెట్లతో ప్రకృతిమాత కొత్త అందాలు సంతరించుకుంటుంది. మనిషిని, మనస్సును, బుద్ధిని వికసింపజేసే అహ్లాదభరిత వాతావరణంలో ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. అంటే నిన్నటి వరకు ఉన్న ప్లవనామ సంవత్సరం నుంచి నేటితో శుభకృతు నామ సంవత్సర ఉగాదిలోకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా ఉగాది విశిష్టతతోపాటు ఈ రోజున ఏమేం చేయాలో తెలుసుకుందాం…

చైత్ర శుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి , వేడుక చేసుకోడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి. చైత్రమాసానికి శిశిర ఋతువు పోయి వసంత ఋతువు… అంటే  ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి. పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం, పగుళ్ళు, పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది. ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత, పిందెలు, పండ్లు – ఇలా అంతా ఫలవంతంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు.. మానసికంగా కూడా చైత్రమాసం ఉల్లాసాన్ని, ఉత్సాహాన్నీ ఇస్తుంది. చలికాలంలో, వర్షాకాలంలో ఉండే మందకొడితనం వసంతఋతువు నుంచి ఉండదు. ఒకవిధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం.

ఎలా జరుపుకోవాలి?
ఉగాది పండుగ జరుపుకునే విధానాన్ని అత్యంత ప్రామాణిక గ్రంథమైన ‘ధర్మసింధు’’పంచవిధుల సమన్వితం’గా సూచిస్తోంది. అవి
1. తైలాభ్యంగనం, 2. నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), 4. ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), ç5. పంచాంగ శ్రవణం…

తైలాభ్యంగనం
తైలాభ్యంగనం అంటే తల మొదలుకొని ఒళ్లంతా నువ్వుల నూనె పట్టించి నలుగుపెట్టి తలస్నానం చేయడం  ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను నివసిస్తారని, అందుకే నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన వారికి లక్ష్మి, గంగాదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి.

నూతన సంవత్సర స్తోత్రం
అభ్యంగ స్నానానంతరం దీపధూపాది పూజాదికాలు చేసిన తర్వాత మామిడి ఆకులతో, పూలతోరణాలతో అలంకరించిన పూజామందిరంలో నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించాలి.

ఉగాడి పచ్చడి సేవనం
ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ సేవించాలి. ఉగాది నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా షడ్రుచుల సమ్మేళనంతో ఉంటుందని చెబుతారు.

పురాణ కాలం నుంచి… చారిత్రకాల వరకు…
► అనేక పురాణ కథల్లో ఉగాది ప్రస్తావన కనిపిస్తుంది. విష్ణుమూర్తి మత్సా్యవతారం ఎత్తింది చైత్ర శుద్ధ పాడ్యమి నాడే.
► బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించింది ఉగాదినాడే.
► ఈ కారణంగానే ఉగాది నాడు కొత్త లెక్కలు ప్రారంభించే ఆచారం వచ్చింది.
► వనవాసానంతరం సీతారాములు అయోధ్యకు తిరిగి వచ్చింది ఈనాడే.
► వసు చక్రవర్తి తపస్సు చేసి ఈనాడే రాజ్యాధికారం సాధించాడు. అందుకే ఉగాదికి అంత ప్రాశస్త్యం.
► చరిత్రలో అత్యంత పరాక్రమశాలి విక్రమార్కుడు. ఆ తేజోవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడయ్యింది చైత్ర శుద్ధ పాడ్యమినాడే. అదేవిధంగా మరో శకకారుడైన శాలివాహన శకం కూడా ఉగాదిరోజునే ఆరంభమైంది. వీరిద్దరినీ ఉగాదిరోజున స్మరించుకోవడం ఆచారం.
► చైత్ర శుక్ల పాడ్యమి నాడు నూతన సంవత్సరాది. ఈ సంప్రదాయం కన్నడ, మహారాష్ట్రులకు కూడ ఉంది.

పంచాంగ శ్రవణం
ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి గంగాస్నాన ఫలితం లభిస్తుందని పురాణోక్తి.

ఏమిటీ పంచాంగం?
మనకు తెలుగు సంవత్సరాలు ‘ప్రభవ’ తో మొదలుపెట్టి ‘అక్షయ’ నామ సంవత్సరం వరకు గల 60 సంవత్సరాలలో తాము జన్మించిన నామ సంవత్సరాన్ని జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చూస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరాలకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి ‘షష్టిపూర్తి’ ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.

పంచాంగంలో ఏముంటుంది?
నిత్య వ్యవహారాల కోసం అందరూ ఇంగ్లీషు క్యాలెండర్‌ని  ఉపయోగిస్తున్నప్పటికీ… శుభకార్యాలు, పూజాపురస్కారాలు, పితృ దేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికి ‘పంచాంగం’ చూడటమే ఆచారం. ఇది మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం.

‘పంచాంగం’ అంటే… తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంగాలు కలది అని అర్థం. పాడ్యమి నుంచి పూర్ణిమ లేదా అమావాస్య వరకు 15 తిథులు, ఆదివారం నుంచి శనివారం వరకు ఏడు వారాలు, అశ్వని మొదలు రేవతి వరకు 27 నక్షత్రాలు, విష్కంభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగాలు, బవ మొదలుకొని కిం స్తుఘ్నం వరకు11 కర ణాలు ఉన్నాయి. వీటన్నిటినీ తెలిపేదే పంచాంగం.

‘పంచాంగ శ్రవణం’ ఉగాది విధుల్లో ఒకటి. నేడు పల్లెటూళ్లు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము . ఇప్పుడంటే పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి కానీ ఇంతకుమునుపు ఇలా దొరికేవి కాదు. తాళపత్రాల మీద రాసినవి మాత్రమే… అదీ కొందరు పండితులవద్ద మాత్రమే ఉండేవి కాబట్టి వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేసేవారు.

పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పం చాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏయే గ్రహాలకు ఏయే అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.

ఎవరిని ధ్యానించాలి?
ఈ పండుగకు అధిదేవత రాముడు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి లేదా వినాయకుడు వంటి దేవతలు కారు. కాలపురుషుడు ఈ పర్వపు అధిదేవత. ‘ఓం కాలాయనమః’ అనే నమక మంత్రం గాని విష్ణు సహస్రం గాని పఠించాలి. భగవంతుడే కాలపురుషుడని, నిత్యం అతణ్ణి ధ్యానించాలని శాస్త్రం చెబుతోంది. మానవ జీవితం అంతా కాలం పైననే ఆధారపడి ఉండుట వలన కాలపురుషుని ఆరాధించాలి. మనం చేసే పంచాంగ శ్రవణమే ఈ ఆరాధన. విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో చెప్పినట్లు మనం ఏ రూపంలో స్తుతించినా అది పరమాత్మునికే చెందుతుంది. ఈ దృష్టితో కాలపురుషుని పంచాంగ శ్రవణ రూపాన స్తుతించాలి. ఇంకనూ సత్కర్మానుష్టానానికి కావలసిన కాల విశేషణాలను తెలుసుకోవడమే పంచాంగం ప్రయోజనం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనేవి పంచాంగాలు. ఒక శుభ కార్యం గాని ఒక ధర్మకార్యం గాని చేయడానికి పంచాంగమే మనకు మార్గదర్శనం చేస్తుంది. ఈ చైత్రమాసపు శుద్ధ పాడ్యమి నుంచి వసంతరాత్రులు జరుపుకుంటారు. అంతేకాదు, తెలుగువారి ప్రీతికరమైన శ్రీ రామనవమి కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ శ్రీ శుభకృత్‌నామ సంవత్సర ఉగాది మన దేశమంతటికీ శుభాలను చేకూరుస్తుందనీ, సకల జీవులకు సుఖశాంతులు ప్రసాదించగలదనీ ఆకాంక్షిద్దాం.

Post bottom

Leave A Reply

Your email address will not be published.