యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి నిత్య కైంకర్యాల సమయాల్లో మార్పులు చేసినట్లు ఈవో గీతారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మార్పులను భక్తులు గమనించాలని సూచించారు.
►సర్వదర్శన వేళలు: ఉదయం 6 నుంచి 7.30 వరకు, తిరిగి 10 నుంచి 11.45 వరకు, మళ్లీ మధ్యాహ్నం 12.30 నుంచి 3 వరకు, సాయంత్రం 5 నుంచి 7 వరకు, రాత్రి 8.15 నుంచి 9 వరకు..
►బ్రేక్ దర్శనాలు: ఉదయం 9 నుంచి 10 వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు..
►విశేష పూజలు: తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతసేవ. ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు రాజభోగం (ఆరగింపు). మధ్యాహ్నం 3 – 4 గంటల మధ్య ఆలయం మూసివేత. రాత్రి 7 నుంచి 7.45 వరకు తిరువారాధన. రాత్రి 7.45 నుంచి 8.15 వరకు సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన. రాత్రి 9 నుంచి 9.30 వరకు రాత్రి నివేదన. 9.30–9.45 శయనోత్సవం, ద్వార బంధనం.
►ఆండాళ్ అమ్మవారి సేవ: ప్రధానాలయంలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు.
స్వర్ణ తాపడానికి రూ.18.71 కోట్ల విరాళాలు
సాక్షి, యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్య విమాన గోపురం స్వర్ణ తాపడానికి భక్తుల నుంచి వచ్చిన విరాళాలను దేవస్థానం అధికారులు గురువారం ప్రకటించారు. బుధవారం సాయంత్రం వరకు భక్తుల నుంచి రూ.18,71,11,346 దేవస్థానం ఖాతాలో జమయ్యాయని తెలిపారు. దివ్య విమాన గోపురానికి 125 కిలోలతో స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు రూ.65 కోట్లు ఖర్చవుతాయని అంచనా.