Telugu Updates

ఆర్కే రోజా ఆచి తూచి అడుగులు

Post top

తిరుపతి, ఫిబ్రవరి 22: ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు సొంత పార్టీలో నేతల తిరుగుబాట్లు, మరోవైపు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో కలపడంతో ఆమె తన రాజకీయ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు. వైసీపీలోనే ఉండి తేల్చుకోవాలని సిద్ధమవుతున్నారు. త్వరలో జగన్ ను కలసి తనను రాజకీయంగా ఇబ్బందులు పెట్టే సమస్యలపై చర్చించనున్నారు. ఇందుకోసం రోజా జగన్ అపాయింట్‌మెంట్ ను కోరారుఆర్కే రోజా నగరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచారు. 2014లో గెలిచినప్పుడు ఆమె అప్పటి అధికార తెలుగుదేశం పార్టీతోనే ఆమె ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ 2019లో తాను గెలిచి, వైసీపీ అధికారంలోకి వచ్చినా రోజా సంతృప్తికరంగా లేరు. నిత్యం సొంత పార్టీ నేతలతోనే యుద్ధం చేయాల్సి వస్తుంది. తనను వ్యతిరేకించే వారికి పదవులను పార్టీ హైకమాండ్ కట్టబెడుతుండటం ఆమెలో అసహనాన్ని తెప్పిస్తుంది. ఆర్కే రోజా సొంత పార్టీ నేతలతో నేరుగా యుద్ధం చేయడానికే రెడీ అయ్యారు.

తనను వ్యతిరేకించే వారిని పార్టీ నుంచి బయటకు పంపాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. వారు పార్టీలోనే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తనకు ఇబ్బంది అవుతుందని రోజా భావిస్తున్నారు. అందుకే జగన్ తోనే నేరుగా మాట్లాడి తన నియోజకవర్గంలో పరిస్థితులను చర్చించాలని ఆమె డిసైడ్ అయ్యారు. పార్టీని వీడతారన్న ప్రచారాన్ని ఆమె కొట్టి పారేసినా, తనకు జగన్ నుంచి సరైన హామీ లభించకుంటే ఆమె కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు మాత్రం లేకపోలేదు. దీంతో పాటు నగరి నియోజకవర్గాన్ని శ్రీబాలాజీ జిల్లాలోనే కొనసాగించాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లాలోకి వెళితే తనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని భావించి ఆమె ఇప్పటికే చీఫ్ సెక్రటరీని కలసి వినతి పత్రాన్ని ఇచ్చారు. నగరి తిరుపతికి అతిసమీపంలో ఉంటుందని, దానిని చిత్తూరు జిల్లాలో కలపవద్దని కోరుతున్నారు. ఈరెండు అంశాల్లో జగన్ ను రోజా గట్టిగా కోరే అవకాశాలున్నాయి. మరి రోజా ఆవేదనను జగన్ అర్థం చేసుకుంటారా? ఆమె డిమాండ్లపై ఎలా స్పందిస్తారన్నది త్వరలోనే తెలిసిపోనుంది.

Post bottom

Leave A Reply

Your email address will not be published.